రాత్రి అయితే చాలు ఇళ్ళల్లో దోమల బెడద మొదలవుతుంది. ఆ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ మొదలైన వ్యాధులు వస్తాయి. మరి దోమలను చంపటానికి మార్కెట్లో అనేక రకాల మందులు ఉన్నాయి. అవి కాకుండా మన ఇంట్లో ఉండే కొన్ని సహజమైన పదార్ధాలతోనే అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా దేవుడికి హారతి ఇచ్చేందుకు కర్పూరం వాడతారు. కానీ ఓ చిన్న ప్లేట్లో కర్పూరాన్ని తీసుకొని , మూసివున్న గదిలో 30నిముషాలు ఉంచినట్లయితే ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయట.

అందరి వంటింట్లో వెల్లుల్లి కనిపిస్తోంది. వీటిలో దోమలను నివారించే చాలా ఔషధ గుణాలున్నాయి. కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచి , వాటిని నీళ్ళల్లో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ ద్రవాన్ని ఇళ్ళంతా పిచికారీ చేయాలి. ఇలా చేస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. అయితే ఆ ద్రవం గాఢత కొద్దీ సేపట్లోనే పోతుంది. కాబట్టి మనం ఎలాంటి ఇబ్బంది పడనక్కరలేదు. కొందరికి తెల్లారితే కాఫీ తాగనిదే రోజు ప్రారంభం కాదు .

దాదాపు అన్ని ఇళ్ళల్లో కాఫీ పొడి ఉంటుంది. దీనికి కూడా దోమలను తరిమేసే శక్తి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారనంగా నీళ్లు నిలకడగా ఉన్న ప్రదేశంలో దోమలు గుడ్లు పెడతాయి . కావున ఆ నీటిపై కొద్దిగా కాఫీ పొడి చల్లితే దోమ లార్వాలు చనిపోతాయి. అందరు ఇళ్లల్లో పుదీనను బాగా వాడుతారు , అలాగే పుదీన పచ్చడి కూడా చేసుకుంటారు. పుదీనలో చాలా ఔషధ గుణాలుంటాయి. పుదీనా వాసనకు దోమలు ఆమడ దూరం ఎగిరిపోతాయి . దీనిలోని ఔషధ గుణాలు పరిసరాలలోని దోమలను నివారిస్తాయి. ఇంట్లో ఏదోమూల పుదీన ఆకులను గాని , పుదీనా రసాన్ని కానీ ఉంచినట్లయితే దాని నుండి పరిమళించే సువాసన కారణంగా దోమలు దరిచేరవు.