కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించకుంటే ఎవరికైనా చలానాలు వేస్తున్నారు.. తాజాగా హీరో నిఖిల్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ సినీ నటుడు నిఖిల్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. కారు నంబరు ప్లేటు నిబంధనల ప్రకారం లేదని మరో చలానాను పంపారు. అయితే, నిబంధనల ఉల్లంఘన సమయంలో నటుడు నిఖిల్ కారులో లేరని పోలీసులు ధ్రువీకరించారు.
కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉంది. కరోనా వైరస్ కేసులకు కట్టడి వేసేందుకు విధించిన లాక్డౌన్ను ప్రభుత్వం ఇప్పటి వరకు రెండుసార్లు పొడిగించింది. తాజాగా విధించిన లాక్డౌన్ నిబంధనలు ఈ నెల 9 వరకు అమల్లో ఉంటాయి. ప్రాణాలను కాపాడుకోవాలంటే రూల్స్ పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.